రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి గితే
రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.
పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు, నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.






