12 August, 2026 | 5:34 PM

బీజేపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

12-08-2026 04:38 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు జరిగాయి.  నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో  తిరంగా ర్యాలీని నిర్వహించారు. మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు.

కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఈ భారీ తిరంగా ర్యాలీ భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. ప్రతి ఒక్కరి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగర వాసులను విశేషంగా ఆకర్షించింది.

ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమర వీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమన ను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,  నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.