12 August, 2026 | 5:06 PM

సండ్ర వెంకట వీరయ్యపై పిడమర్తి విమర్శలు

12-08-2026 04:36 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి.. వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సండ్ర వెంకట వీరయ్యపై పిడమర్తి రవి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను రాజకీయ వివాదాల్లోకి లాగడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని మండిపడ్డారు.

సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై పోలీసులు, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు వాస్తవాలను తేలుస్తాయని.దర్యాప్తు పూర్తికాకముందే వాటిని రాజకీయంగా ఉపయోగించుకుని వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడి లక్షణం కాదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను రాజకీయ విమర్శల్లోకి లాగడం పూర్తిగా ఖండించాల్సిన విషయమని అన్నారు. 

పిడమర్తి రవి గత రాజకీయ ప్రస్థానం, గతంలో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలను తాము కూడా ప్రస్తావించగలమని, అయితే వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకురావడం తమ రాజకీయ సంస్కారం కాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో సండ్ర వెంకట వీరయ్య పేరును పదేపదే ప్రస్తావించడం వల్ల పిడమర్తి రవికే రాజకీయంగా నష్టం జరుగుతుంది.అని వ్యాఖ్యానించారు. సండ్ర వెంకట వీరయ్యపై గతంలో రెండుసార్లు పోటీ చేసిన పిడమర్తి రవి, ప్రజల్లో బలమైన నాయకుడిగా ఉన్న సండ్రను విమర్శించే ముందు తన రాజకీయ స్థాయిని, ప్రజల్లో తనకున్న ఆదరణను ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

సండ్ర వెంకట వీరయ్య  కుటుంబ సభ్యులను రాజకీయ విమర్శల్లోకి లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్న సీనియర్ నాయకుడని పేర్కొన్నారు. ఆయనపై అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు మౌనంగా ఉండబోవని.హెచ్చరించారు.