ఎల్‌నినో ప్రభావంతో.. పంటల మార్పిడే మేలు
చివ్వెంల: మండలంలోని గుర్రం తండా గ్రామపంచాయతీలో అదనపు కలెక్టర్ బి. హరీసింగ్ ఆధ్వర్యంలో “రైతులతో మాట–పంట మార్పిడికి బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా సమావేశమైన ఆయన పంటల సాగు, వాతావరణ పరిస్థితులు, పంటల మార్పిడిపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి కంది, పెసర, మినుము, జొన్న వంటి వర్షాధార, వాతావరణ అనుకూల పంటలను సాగు చేయాలని సూచించారు.
భవిష్యత్ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాంటింజెన్సీ ప్రణాళికకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా సాగు ప్రమాదాలను తగ్గించుకోవచ్చన్నారు. తక్కువ నీటి లభ్యతలోనూ మంచి దిగుబడులు ఇచ్చే వర్షాధార పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.
పంటల వైవిధ్యీకరణతో రైతులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను అధిగమించడంతో పాటు సాగులో నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి బి. శైలజ, పంచాయతీ కార్యదర్శి కిరణ్, సర్పంచ్ ధరావత్ రవీందర్, రైతులు జాటోత్ రవీందర్, బాణోత్ నాగులు, మంగ్య, కిషన్, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.






