మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు
హుజుర్ నగర్ సీఐ చరమంద రాజు
నేరేడుచర్ల, జూన్ 10 : మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి వారి పైనైనా కఠిన చర్యలు తప్పవని హుజుర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చరమంద రాజు హెచ్చరించారు. బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నేరేడుచర్ల ఎస్త్స్ర ఏ. సైదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాలు అవగాహనా కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు.
నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయని,మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ముద్ర కలిగిన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. పట్టుబడితే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం వల్ల జరిగే ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కలిపించారు.
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఒక్క క్షణం మీ నిర్లక్ష్యం, మీ కుటుంబాన్ని తీరని శోకంలోకి నెట్టేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహేచ్.నాగరాజు, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి,వివిధ వార్డుల కౌన్సిలర్ లు,ఎక్స ఆఫీషియో సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.






