జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. నిరాడంబర రాజకీయ నాయకుడిగా, అసాధారణ వాగ్ధాటితో కూడిన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ప్రజాస్వామ్య విలువలకు అంకితభావంతో సేవలందించిన నాయకుడిగా జైపాల్ రెడ్డి చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి, కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో ఆయన అందించిన సేవలు, దేశాభివృద్ధి పట్ల చూపిన నిబద్ధత, ప్రజా సమస్యలపై ఆయనకున్న లోతైన అవగాహన ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రజాసేవా స్ఫూర్తి, రాజకీయ విలువలు, ప్రజాహితానికి అంకితమైన వారి జీవితం భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన ప్రజాజీవితాన్ని గడిపారని రేవంత్ రెడ్డి తెలిపారు.






