సింగరేణి నష్టాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్సే కారణం
- సింగరేణి నష్టాలకు ఆ రెండు పార్టీలే కారణం
- కేసీఆర్ సింగరేణి ఆదాయానికి గండి కొట్టారు
- పదేళ్ల కేసీఆర్ పాలనలో నష్టాల్లో సింగరేణి
న్యూఢిల్లీ: వాజ్ పేయి హయాంలో కేంద్రం సింగరేణికి చేయూత అందించిందని, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao).. సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister kishan reddy ) తెలిపారు. సింగరేణికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు భారీగా బకాయిలు పెట్టాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి నష్టాలకు ఈ రెండు పార్టీలే కారణమని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గుబ్లాక్ ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. ఆనాడు కేసీఆర్ అవలంభించిన వైఖరి వల్ల సింగరేణికి కొత్త బ్లాక్ లేకుండా పోయాయని విమర్శించారు.
ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆనాడే నైనీ కోల్ బ్లాక్(Naini Coal Block) సింగరేణికే దక్కేవని సూచించారు. ఇవాళ కేంద్రం చొరవ తీసుకుని తాడిచర్ల 2 కోల్ బ్లాక్ సింగరేణికే దక్కిందన్నారు. తాడిచర్ల 1 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కకుండా కేసీఆర్ అడ్డుకున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు సింగరేణికి పోటీగా జెన్ కో వేసిన టెండర్ ఉపసంహరించుకోవాలన్నారు. నైనీ, తాడిచర్ల 2, పీకేవోసీ బ్లాక్ లు సింగరేణికి దక్కితే సంస్థ లాభపడుతోందన్నారు.
మోదీ వచ్చాక సింగరేణి విద్యుత్ ఉత్పత్తి సంస్థకు ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ ను కేటాయించారని తెలిపారు. మూడు కోల్ బ్లాక్ లు సింగరేణికి దక్కితే 6,500 మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. మూడు కోల్ బ్లాక్ ల ద్వారా సింగరేణికి రూ. 1.95 లక్షల కోట్ల టర్నోవర్ వస్తుందని లెక్క చెప్పారు. పరీక్షల అక్రమాల నిరోధక బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. చాలా కఠినమైన కొత్త చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. అన్ని పార్టీలు కొత్త బిల్లుకు మద్దతు తెలపాలని, మంచి సూచనలు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.






