30 July, 2026 | 4:18 PM

కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతి

30-07-2026 03:31 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండగా,మున్సిపల్ పాలకులు,అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ ఆరోపించారు.గురువారం కుక్కల దాడిలో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి బాన్సువాడ ఆర్డీఓ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ,గత రెండు రోజులుగా పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు.ఈ దాడుల్లో సుమారు 11 మంది చిన్నారులు,ఒక మహిళ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి,నిజామాబాదు ఆసుపత్రి లలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలని,కుక్కలను పట్టుకుని తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ప్రజల భద్రత విషయంలో ఇకపై నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.