ఈ పాపం ఎవరిది?
చికెన్ వ్యర్థాలతో వాగు కలుషితం
ప్రమాదకర సూక్ష్మజీవులతో అనారోగ్యం
ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
జిన్నారం/అమీన్ పూర్, మార్చి 11: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కొడకంచి, గడ్డపోతారం మున్సిపాలిటీకి చెందిన మాదారం గ్రామాల సరిహద్దులో ఉన్న వాగులో చికెన్ షాపుల వ్యర్థాలను వేయడం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. కొడకంచి, మాదారం ప్రాంతాలకు చెందిన కొంతమంది చికెన్ షాప్ యజమానులు చికెన్ వ్యర్థాలను వాగులో పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా వాగు నీరు పూర్తిగా కలుషితమై దుర్వాసన వెదజల్లుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పర్యావరణానికి కూ డా హాని కలుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గడ్డ పోతారం, జిన్నారం మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లే దనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాగులో వ్య ర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వాగు పరిసరాలను శుభ్రపరిచి కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజారోగ్యం బలి...
వాగుల్లో, చెరువుల్లో కోళ్ళ వ్యర్థాలు వే యడం వల్ల సూక్ష క్రిములు అందులో పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ రించింది. ట్రమటోడా జాతికి చెందిన సిస్టోజోమా, క్లొనార్క్సైనిన్స్ అనే సూక్ష్మజీవులు, ఫేషియోలాప్సిస్ బుస్కీ అనే క్రిములు కోళ్ళ వ్యర్థాల నుంచి పెరుగుతాయి. కోళ్ళ మలవిసర్జనలో ఈకోలి బ్యాక్టీరియా ఉంటుంది. వాగుల్లో, చెరువుల్లో వ్యర్థాలు వేయడం వల్ల నీరు కలుషితమై మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం...
వాగులో కోళ్ళ వ్యర్థాలను వేయకుండా చికెన్ దుకాణదారులకు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారికి జరిమానా కూడా విధిస్తాం. కోళ్ళ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. సిబ్బందిని పంపించి పరిశీలిస్తాం. ఇదే విషయంలో జిన్నారం కమిషనర్ తిరుపతిని వివరణ కోరగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వెంకటరామయ్య, కమిషనర్, గడ్డపోతారం మున్సిపాలిటీ




