శీతల మాత ఆలయంలో తొక్కిసలాట
- 8 మంది మహిళలు దుర్మరణం.. 12 మందికి తీవ్ర గాయాలు
- ఆలయ సిబ్బంది నిర్లక్ష్యమేనని పలువురి ఆరోపణ
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
- బీహార్‌లోని నలంద జిల్లాలో ఘటన
పాట్నా, మార్చి 31: బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని శీతల మాత ఆలయంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయం లో ఆలయ పరిసరాల్లో భక్తుల రోదనలు మిన్నంటాయి. ఆలయం వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన వారిలో అందరు మహిళలే ఉన్నారు. అలాగే ఈ ప్రమాదంలో 12 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. కాగా చైత్ర మాసంలో చివరి మంగళవారం కావడంతో శీతల మాత ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
బాగా రద్దీగా ఉండడంతో అంబులెన్స్‌లు కూడా అక్కడకు చేరుకోవడం కష్టంగా మారింది. నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




