పొగాకుకు దూరంగా ఉండండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్, బీడీ, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్, గుండెపోటు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. చిన్న వయసులో మొదలయ్యే అలవాటు వ్యసనంగా మారి యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని, విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలు నిషేధమని తెలిపారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.






