28 July, 2026 | 5:04 PM

టెలివిజన్(టీవీ) అవార్డులపై చర్చించిన మంత్రి కోమటి రెడ్డి

28-07-2026 04:47 PM

హైదరాబాద్: టీవీ అవార్డుల కోసం ప్రత్యేక లోగో, ప్రముఖుల పేరు, ఏయే కేటగిరీలకు అవార్డులు ఇవ్వాలనే అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టెలివిజన్ అవార్డు కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డిసి ఎండీ ముకుంద రెడ్డి, కమిటి చైర్మన్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... టెలివిజన్(టీవీ) రంగం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నిచ్చే రంగం ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారని, టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి, మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్, ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ మూవీలు తీసే వారిని ప్రోత్సహిస్తామని పేర్నొన్నారు. 

కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పీవీ నరసింహారావు పేరు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని, ఆయన బహుభాషా కోవిదుడు, తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావు, దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టిన గొప్ప మేధావి. అట్లాంటి వారి పేర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, కమిటీ వీలైనంత త్వరగా గైడ్లైన్స్, లోగో, అవార్డ్స్ పేరు లాంటివి తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.

పేరు అయిన, లోగో అయిన తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా ఉండాలని, మొట్ట మొదటి సారి ఇవ్వబోయే ఈ అవార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేయాలని కమిటీ చైర్మన్, సభ్యులకు సూచించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ముకుంద రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని, అవార్డుల వేదిక కూడా రెండు, మూడు ఆప్షన్స్ ఇవ్వండని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశాలన్నీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటి రెడ్డి వెల్లడించారు.