ఎలికట్ట చౌరస్తాలో గంజాయి విక్రేత అరెస్ట్.. కిలో గంజాయి స్వాధీనం
షాద్‌నగర్,(విజయక్రాంతి): షాద్‌నగర్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్. ప్రణయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి మే 29న సాయంత్రం ఎలికట్ట చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి పోలీసులను గమనించి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న నీలి రంగు కవర్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
పంచుల సమక్షంలో నిర్వహించిన పంచనామా అనంతరం నిందితుడి వివరాలు సేకరించగా, అతను చోటు కుమార్ (21), తండ్రి విష్ణు దేవ్ సహాని, స్వస్థలం పూర్ణియా జిల్లా, బీహార్ రాష్ట్రం అని వెల్లడైంది. ప్రస్తుతం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నివసిస్తూ కూలీ పనులు చేస్తున్నట్లు తెలిపాడు. విచారణలో నిందితుడు బీహార్ నుంచి రెండు నెలల క్రితం ఉపాధి కోసం తెలంగాణకు వచ్చాడని, గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు.
ఎలికట్టలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకే గంజాయి కొనుగోలు చేసి, పరిసర ప్రాంతాల్లోని కూలీలు మరియు వ్యసనపరులకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 456/2026, ఎన్‌డీపీఎస్ చట్టం 1985లోని సెక్షన్ 8(c), 20(b)(ii)(A) కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ కె. సీతారాం ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారి ఎస్‌ఐ ఆర్. శ్రీకాంత్ నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.






