5 August, 2026 | 2:20 AM

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట

04-08-2026 04:30 PM

చెన్నై: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్‌ను రిమాండ్‌కు పంపే ఉద్దేశం లేదని ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేయాలని  మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టు సూచించింది.

జస్టిస్ జీకే ఇళంతిరైయన్ సమక్షంలో ఉదయనిధి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని రిమాండ్‌కు పంపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ తెలిపారు. విచారణ అనంతరం ఆయనను ఇవాళే స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తామని పేర్కొన్నారు. పరోక్ష వ్యాఖ్యలు చేయడం, ఓ మహిళా గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన ఈ కేసు విచారణలో ఆ డీఎంకే నాయకుడు పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.

అడ్వకేట్ జనరల్ సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఉదయనిధి బెయిల్ పిటిషన్‌ను ముగించింది. కావేరీ అంశంపై సోమవారం తంజావూరులో జరిగిన నిరసన సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం పోలీసులు ఉదయనిధి నీలంకరై నివాసానికి వచ్చిన వెంటనే, ఆయన తరపున ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసి, విచారణ కోసం తంజావూరుకు తరలించారు.