23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్
* ఏబీవీపీ మండల కన్వీనర్ పల్లె సంతోష్
పాపన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడని, ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ... ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు మండల కన్వీనర్ పల్లె సంతోష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడని, అందుకే రేషనలైజేషన్ పేరుతో 23000 పాఠశాలలను మూసేందుకు కంకణం కట్టుకున్నాడని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఏజెంట్ లా వ్యవహరిస్తున్నాడని, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పేట్ పరిచిందని ఎద్దేవా చేశారు.
వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న ఏబీవీపీ పాఠశాలల బందుకు పిలుపునిచ్చింది. కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.






