పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల కౌంట్‌డౌన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచందర్ రావు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత వల్లే ఈరోజు యోగాకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప గుర్తింపు లభించిందని, విదేశాల్లో సైతం యోగా ప్రాముఖ్యతను గుర్తించి ఎంతో ఉత్సాహంగా ఆచరిస్తున్నారు.
యోగా అనేది కేవలం శారీరక ఆరోగ్యానికే పరిమితం కాదు, మానసిక ప్రశాంతతకు, సామాజిక సమతుల్యతకు ఇది ఎంతో అవసరమని ఆయన తెలిపారు. నేటి యువతను పీడిస్తున్న డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను దూరం చేయడానికి యోగా ఒక అద్భుతమైన సాధనం. అలాగే, వయసు పైబడకుండా యాంటీ ఏజింగ్ లా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని, ప్రతి విద్యార్థి యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, తల్లిదండ్రులు వారిని తప్పకుండా ప్రోత్సహించాలన్నారు.
ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో, అంతర్గత శక్తిని పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను సాధించడంలో, సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా నిరంతరం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ ఏడాది థీమ్ “Yoga for Healthy Ageing” అన్ని వయస్సుల వారిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, సమగ్ర ఆరోగ్యం పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.
స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఖేలో భారత్ వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలతో మోదీ దేశాన్ని ఆరోగ్యకరమైన మార్గంలో నడిపిస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యోగా కార్యక్రమాలు జరగడం అభినందనీయం. రేపు ఇందిరా పార్క్ లో జరగబోయే యోగా దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






