14 August, 2026 | 4:16 PM

ఫోరెన్సిక్ సేవలకు అధునాతన సదుపాయాలు

14-08-2026 02:40 PM

రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల మోర్చరీ ఆధునీకరణ

పెద్దపల్లి,(విజయక్రాంతి) రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగంలో మెరుగైన సదుపాయాలు కల్పించి, ప్రజలకు, పోలీసు శాఖకు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో-లీగల్ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రతి నెల సుమారు 30 మెడికో-లీగల్ పోస్టుమార్టంలు నిర్వహిస్తున్న ఈ విభాగంలో క్లిష్టమైన కేసులు కూడా ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.

శాస్త్రీయ పద్ధతుల్లో, నిష్పక్షపాతంగా, సకాలంలో పోస్టుమార్టంలు నిర్వహించడం ద్వారా పోలీసుల దర్యాప్తుకు, న్యాయ ప్రక్రియకు ఫోరెన్సిక్ వైద్యులు కీలక సహకారం అందిస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతలకు సంబంధించిన కేసుల్లో అవసరమైన సందర్భాల్లో రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టంలు నిర్వహిస్తున్నందున, మెడికో-లీగల్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

4 కోల్డ్ ఫ్రీజర్ బాక్సుల ఏర్పాటు

మోర్చరీలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు సరైన లైటింగ్, కొత్త డిసెక్షన్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మృతదేహాలను సురక్షితంగా, గౌరవప్రదంగా భద్రపరిచేందుకు 4 కోల్డ్ ఫ్రీజర్ బాక్సులను మంజూరు చేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయాలు మృతదేహాల భద్రత, సంరక్షణతో పాటు పోస్టుమార్టం ప్రక్రియను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.

ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం న్యాయ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున, శాస్త్రీయ విధానం, నిష్పక్షపాత వైఖరి, సకాలంలో సేవలందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మెరుగైన మోర్చరీ సదుపాయాలతో ప్రజలకు, పోలీసు శాఖకు, న్యాయవ్యవస్థకు మరింత నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.