పోస్టర్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ క్రైమ్ ఆగస్టు,25 (విజయక్రాంతి): పేదలపై విద్యుత్ భారాన్ని తగ్గించడం, తద్వారా కర్బన ఉద్ఘరాలు, వాతావరణ కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జైవిక్ కంపెనీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడానికి మారుతి ఏజెన్సీస్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్,మారుతి ఏజెన్సీస్ నిర్వాహకుడు తిప్పారపు ఆంజనేయులు, ఆ సంస్థ ప్రతినిధులు దేవోజు వెంకటరమణాచారి, తిప్పారపు రవివర్మలతో కలసి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం పోస్టర్లను మంగళవారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2027 మార్చి నాటికి దేశంలోని కోటి కుటుంబాలకు సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నదని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రూప్ టాప్ సోలార్ స్కీమ్ గా ఆయన అభివర్ణించారు.
ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి సగటున రూ.77,800 సహాయం అందుతుందన్నారు. ఒక కిలో వాట్ వరకు రూ.30,000, రెండు కిలోవాట్లకు రూ. 60000, మూడు కిలోవాట్లకు 78 వేల సబ్సిడీ లబ్ధిదారులకు లభిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా తమ గృహాలకు అవసరమైన విద్యుత్తును వాడుకొని మిగిలిన విద్యుత్తును లబ్ధిదారులు డిస్కంలకు విక్రయించడం ద్వారా ఆదాయం పొందవచ్చని సూచించారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన మారుతి ఏజెన్సీస్ నిర్వాహకులను కోరారు.






