8 April, 2026 | 11:13 PM

రాష్ట్ర స్థాయి కామర్స్ బిజినెస్ క్విజ్

08-04-2026 09:11 PM

మొదటి బహుమతి సాధించిన ఎస్ఆర్ఆర్ బీకాం విద్యార్థులు

ముకరంపుర,(విజయ క్రాంతి): తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (TCA)  ఆధ్వర్యంలో “ప్రేరణ – 2026 రాష్ట్ర స్థాయి కామర్స్ ఫెస్ట్  సికింద్రాబాద్ లోని అవినాష్ కళాశాలలో నిర్వహించారు. ఈ ఫెస్ట్‌లో భాగంగా  రాష్ట్ర స్థాయి పోటీలకు శాతవాహన యూనివర్సిటీ తరపున ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల 15 మంది బి.కాం విద్యార్థులు బిజినెస్ క్విజ్,  ఇతర పోటీల్లో పాల్గొన్నారు. 

రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి, సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో నిర్వహించిన పోటీలలో పాల్గొని బిజినెస్ క్విజ్ లో రాష్ట్రస్థాయి మొదటి బహుమతి ని విద్యార్థులు  సి.హెచ్. తరుణ్ కుమార్, జి.శ్రీలేఖ పొందారు. నగదు బహుమతి, మేమేంటో మరియు  సర్టిఫికెట్లను ప్రొఫెసర్ డి చిన్నప్ప, ప్రొఫెసర్ కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ ల నుండి అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్. ఆర్.ఆర్. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ విద్యార్థులు సి.హెచ్. తరుణ్ కుమార్ జి.శ్రీలేఖ లను మరియు మిగతా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను కూడ అభినందించారు.  ప్రేరణ కార్యక్రమం విద్యార్థులకు  విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని శాతవాహన విశ్వవిద్యాలయం కామర్స్ విభాగ అధిపతి డా.డి.హరికాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.