ఫీజు బకాయిలు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కేసముద్రం మండల కేంద్రంలో బీజేపీ నిరసన ర్యాలీ
కేసముద్రం, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించి, స్థానిక తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు కేసముద్రం మండల శాఖ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే, విద్యార్థుల పక్షాన బీజేపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి, వంగాల కొమ్మాల్ రెడ్డి, లెంకలపల్లి శ్రీనివాస్, గాంతి వెంకట్ రెడ్డి, సవిన్ కుమార్, మహమ్మద్ ఖాసిం, జుజ్జూరు వీరభద్ర చారి, బానోత్ రాము, బానోత్ సంపత్, వల్లందాస్ నగేష్, మండల, గ్రామ కమిటీల బాధ్యులు, శక్తి కేంద్రాల ఇన్చార్జ్లు, అనుబంధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.






