16 August, 2026 | 8:48 PM

చెరువులో దూకిన మహిళకు 108 సిబ్బంది ప్రాణదానం

16-08-2026 08:07 PM

భిక్కనూర్, ఆగస్టు 16 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తితో చెరువులో దూకిన ఓ మహిళను 108 సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన పుష్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో దూకింది. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే 108కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఈఎంటీ రాజేందర్, పైలట్ రాజయ్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నీటిలో ఉన్న పుష్పను బయటకు తీసుకొచ్చారు. ఆమె మింగిన నీటిని బయటకు వచ్చేలా ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అంతేకాకుండా పుష్ప పర్సులో ఉన్న సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడు, నగదును భద్రంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలు కాపాడటంతో పాటు విలువైన వస్తువులను నిజాయితీగా కుటుంబ సభ్యులకు అందించిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.