కోనరావుపేట మండలంలో ఎస్సెస్సీ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ
10 పాఠశాలలకు 100 శాతం ఉత్తీర్ణత
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వివిధ పాఠశాలల ఎస్సెస్సీ మార్చి–2026 ఫలితాలు విడుదల కాగా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మండల వ్యాప్తంగా మొత్తం 449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 441 మంది ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలను నమోదు చేశారు. ఈ ఏడాది మండలంలో 10 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.
విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం కారణమని విద్యాశాఖ అధికారి మురళీ నాయక్ తెలిపారు. మండల టాపర్‌గా కోనరావుపేట మోడల్ స్కూల్‌కు చెందిన బి. విజయ్ 573 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. అదే పాఠశాలకు చెందిన జె. వరుణ్ 570 మార్కులు సాధించి ద్వితీయ స్థానం పొందాడు. విద్యార్థుల విజయంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.






