25 February, 2026 | 6:57 AM

ఆ విషయంలో శ్రీవిష్ణు వెరీ టాలెంటెడ్

25-02-2026 01:48 AM

శ్రీవిష్ణు, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా కథానాయిక నయన్ సారిక విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే.. 

నేను లాయర్ కావాలనుకున్నా. నాకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే నా కెరీర్‌గా మారింది. నటన విషయంలో హ్యాపీగా ఉన్నా.  

నా ఫస్ట్ తెలుగులోనే సినిమా చేశా. అప్పట్నుంచి ఇదే ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. భవిష్యత్తులోనూ తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యత. గంగం గణేశా, ఆయ్, క లాంటి వరుస విజయాలు చాలా ఆనందాన్నిచ్చింది. ‘విష్ణు విన్యాసం’ కూడా మరింత మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నా. మంచి కథా బలం, పాత్ర బలం ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్ని స్తున్నా. డిఫరెంట్ క్యారెక్టర్స్, మంచి పెర్ఫార్మన్స్, కొత్తదనం ఉన్న సినిమాలు చేయాలనుంది. 

నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఇందులోని కొన్ని బోల్డ్ సీన్స్ నా క్యారెక్టర్‌కు, కథకు చాలా ముఖ్యం. నా పాత్ర పేరు మనీషా. తను జీవితంలో బాధలెదుర్కొన్న అమ్మాయి. ఒక పాయింట్ వచ్చిన తర్వాత హాయిగా బతకాలను కుంటుంది. కాలేజీలో ఫ్యాకల్టీగా కనిపిస్తా. విష్ణు క్యారెక్టర్ కూడా అదే. ఇద్దరు లెక్చరర్ల మధ్య జరిగే ప్రేమకథ ఇది. స్టూడెంట్స్, యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

‘విష్ణు విన్యాసం’లో నేను చాలా విభిన్నమైన పాత్రలో నటించాను. నా క్యారెక్టర్‌కు చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో అబ్బాయిలకు కాస్త చిరాకు కలిగిస్తుంది. దానికి కారణమేంటో సెకండ్ హాఫ్‌లో రివీల్ అవుతుంది. అప్పుడు ఆ క్యారెక్టర్‌ను అందరూ ఇష్టపడతారు. 

ప్రేక్షకులను నవ్వించడం నిజంగా కష్టం. శ్రీవిష్ణుకు కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌గా వచ్చేస్తుంది.. ఆ విషయంలో ఆయన వెరీ టాలెంటెడ్. ఆయన స్పాట్‌లో ఇంప్రవైజ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. చాలా జోవియల్ పర్సన్. ఆయన సరదాగా మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది. చాలా మాటలు గుర్తుండిపోతాయి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభూతి కలిగింది.  

చిన్నప్పటి నుంచి టీవీలో ఫిలింఫేర్ అవార్డు అని చూస్తూ పెరిగా. అదే వేదిక మీద నేను అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్ని చ్చింది. అదొక కల నెరవేరిన సందర్భం. రాజమౌళి సినిమాలో చేయడం నా డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నా. -ప్రస్తుతం ‘రాకాస’ సినిమా చేస్తున్నా. అది ఫాంటసీ కామెడీ. కన్నడలో గోల్డెన్ స్టార్ గణేశ్‌తో సినిమా చేస్తున్నా.