7 August, 2026 | 4:39 AM

పేదలకు ‘సన్న’ భరోసా!

07-08-2026 02:14 AM

దేశంలోనే ఉచిత సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి పొంగులేటి

ఈశ్వరమాదారంలో మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించిన శ్రీనివాస రెడ్డి

కూసుమంచి, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ప్రతి లబ్ధిదారుడికి ప్రతినెలా 6 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వర మాదారం గ్రామంలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్.తో కలిసి లబ్ధిదారులకు మూడు నెలల ఉచిత సన్న బియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రజలు వినియోగించకుండా విక్రయించడం లేదా రీసైక్లింగ్ అక్రమాలకు గురికావడంతో ప్రభుత్వ ధనం తీవ్రంగా వృథా అయ్యేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ఎంతో నాణ్యంగా ఉండటంతో లబ్ధిదారులే స్వయంగా వండుకుని తింటున్నారు. రేషన్ దుకాణాల్లో ఒక్క గింజ తక్కువ వచ్చినా డీలర్లను ప్రశ్నించే స్థాయికి ప్రజల్లో చైతన్యం రావడం శుభపరిణామమని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.

మారిన పరిస్థితి సంతోషకరం : లబ్ధిదారులు 

గతంలో ఇచ్చే బియ్యాన్ని తినలేక బయట విక్రయించేవాళ్లమని, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత ఎంతో బాగుండటంతో ఇంట్లోనే వినియోగిస్తున్నామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమ కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరుస్తోందని హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్ వై. సైదిరెడ్డి, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.