మాస్టర్ ను యువక్రీడకారులు ఆదర్శంగా తీసుకోవాలి
చెన్నూర్,(విజయక్రాంతి): యువ క్రీడాకారులు కరాటే మాస్టర్ అట్టెం మధునయ్యను ఆదర్శంగా తీసుకోవాలని రిటైర్డ్ వ్యయామ ఉపాధ్యాయులు కారెంగుల రామయ్య సార్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో క్రీడాకారులను గురుకృప స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు క్రీడా జ్యోతిని వెలిగించి పట్టణంలో రెండు కిలోమీటర్ల పరుగు నిర్వహించిన అనంతరం సీనియర్ కరాటే మాస్టర్ అట్టెం మధునయ్యను ఘనంగా సన్మానించారు. రామయ్య సర్ నేతృత్వంలో క్రీడాకారులను సత్కరించారు. రామయ్య సార్ మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైన సాధ్యమేనని నిరూపించిన మధునయ్యను స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కరాటే నేర్చుకోవాలనే తపనతో ఎంతో కష్టపడి అంతర్జాతీయ స్థాయికి మార్షల్ ఆర్ట్స్‌లో ఎదగడం మనకు గర్వకారణమన్నారు. ఎంతోమంది విద్యార్థులను తన శిక్షణ నైపుణ్యంతో గొప్ప కరాటే క్రీడాకారులుగా తీర్చిదిద్దుతు చెన్నూరు పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడని కొనియాడారు.
ఇటీవల వరల్డ్ గిన్నిస్ రికార్డు కార్యక్రమంలో పాల్గొని రికార్డు సాధించడం మధునయ్య లాంటి వ్యక్తులకే సాధ్యమని అభినందించారు. ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికి మధునయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఫణిధర్, చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, గురుకృప స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కేవీఎం ప్రకాష్, పీడీ డాక్టర్ మల్లేష్, విజయ్ కుమార్, శ్రీకాంత్, అనిత, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల రామస్వామి, సంతోష్, సత్యనారాయణ, సభ్యులు, ఫిట్‌నెస్, స్పిరిట్ టీమ్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.






