29 August, 2026 | 7:30 PM

"ఫీజు బకాయి - బీజేపీ లడాయి" నిరసన దీక్ష

29-08-2026 06:50 PM

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది

బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ

హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో "ఫీజు బకాయి - బీజేపీ లడాయి" నిరసన దీక్ష

హనుమకొండ,(విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా బకాయి పడ్డ రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ను  వెంటనే విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హనుమకొండ లో నిరసన దీక్ష చేపట్టారు.ఈ నిరసన దీక్షను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు లతో కలిసి ప్రారంభించారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకురాలు రావు పద్మ మాట్లాడుతూ.... రోజువారీ కూలి పనులు చేసుకునేవారు, ఆటో డ్రైవర్ల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉన్నతాశయంతో తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణంగా నీరుగారుస్తోందని విమర్శించారు.

ప్రభుత్వం దాదాపు రూ. 15,000 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీనివల్ల వేలాది మంది విద్యార్థులు చేతికి వచ్చిన ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల బకాయిలతో తమకు సంబంధం లేదనడం ముఖ్యమంత్రి అజ్ఞానానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా విద్యార్థుల భవిష్యత్తు గురించి గొప్పలు చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డ విద్యార్థుల గోడును తక్షణమే వినాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు, విద్యాసంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి న్యాయం చేయాలని, నిలిపివేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తరఫున బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.