24 March, 2026 | 1:10 PM

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక ప్యాకేజీ

24-03-2026 01:44 AM

జూన్‌లోపు రూ. 5 వేల కోట్లు విడుదల: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరతిగతిన పూర్తిచేసేందుకు ప్రత్యే క ప్యాకేజీ కేటాయిస్తున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచనల మేరకు జూన్‌లోపు రూ. 5 వేల కోట్ల నిధులను విడుదల చేస్తామని స్పష్టంచేశారు. ఆయా ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వెల్లడిచారు.

గత ప్రభుత్వం హయంలో వేల కోట్లు ఖర్చుచేసి కూడా ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వదిలేశారని విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే వేముల వీరేశం, మిగతా ప్రాజెక్టుల సమస్యలపై ఇతర సభ్యులు పాల్వాయి హరీష్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, అనిల్‌కు మార్‌రెడ్డి, రామచంద్రు నాయక్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్‌ను త్వరలోనే పూర్తిచేసే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. అక్కడ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్య ఉంద ని, దానిని వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. వీలైనంత త్వరలోనే బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తిచేసి నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. ఇతర సభ్యులు లేవనెత్తిన సమస్యలపై సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి పరిష్కరిస్తామని తెలిపారు.