ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
- ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్
- రోడ్లు ఆక్రమణలపై కఠిన వెచ్చరికలు జారి
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి నూతన ఎస్ఐ బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు.మండల కేంద్రంలోని ట్రాఫిక్ సమస్యలను గుర్తించేందుకు ఆయన స్వయం మెయిన్ సెంటర్ నుంచి కల్మల్ చెరువు రోడ్డు వరకు నడుచుకుంటూ పరిస్థితిని పరిశీలించారు. రోడ్లపై వ్యాపారాల విస్తరణ,ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించారు. పార్కింగ్‌కు కేటాయించిన హద్దులు దాటి రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ బి. శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం రోడ్డుపై ఇరువైపులా నిర్వహిస్తున్న వ్యాపారస్తులందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్లాట్ఫామ్ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై పార్కింగ్ చేస్తే జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు.ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులు చిరు వ్యాపారస్తులు ట్రాఫిక్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
కోదాడు మిర్యాలగూడ ప్రధాన రహదారి కావటంతో ట్రాఫిక్ అధికంగా ఉందని దీంతోపాటు దుకాణాల ఎదుట పార్కింగ్ స్థలం ఆక్రమించడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇకనుంచి ఎవరు వాహనాలు రోడ్డుపై నిలబరాదని, ప్లాట్ఫామ్ ను ఆక్రమించి దుకాణాలు నిర్వహించే వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలని ఆయన సూచించారు. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ఇరువైపులా దుకాణాలన్నిటిని పరిశీలిస్తూ వారికి పలు సూచనలు చేశారు.






