మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
కోదాడలో ప్రత్యేక డ్రైవ్.. ఐదు బైక్‌లు సీజ్, కేసులు నమోదు
కోదాడ,(విజయక్రాంతి): మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా మైనర్లు నడుపుతున్న ఐదు ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేసి, సంబంధిత తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. చిన్న వయస్సులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు చలాన్లు విధించినట్లు సీఐ తెలిపారు.ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మైనర్లకు వాహనాలు అప్పగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శివశంకర్ స్పష్టం చేశారు.






