ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వం విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా యాదగిరిగుట్ట కొండ కింద రింగురోడ్డు మధ్యలో గల హెలిప్యాడ్ ను అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం టెంపుల్ సిటీ నందు వేద పాఠశాల భూమి పూజ ను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను సందర్శించి, అక్కడ చేపట్టిన సదుపాయాలను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






