పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, మార్చి 18 :అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీలో పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన 75 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపల్ కమిషనర్లు, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్, జలమండలి, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమీన్పూర్ సర్కిల్ పరిధిలో గల బీరంగూడ, అమీన్పూర్, రామచంద్రపురం, భారతి నగర్, బొల్లారం వార్డుల పరిధిలో గల ప్రతి కాలనీకి పారిశుధ్య సిబ్బందిని కేటాయించి ప్రతిరోజు పర్యవేక్షించాలని కోరారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సైతం తెలుసుకోవాలని సూచించారు. నూతన కాలనీలకు సరిపడి సిబ్బంది లేకపోతే నూతన సిబ్బందిని నియమించాలని సూచించారు.
అతి త్వరలో సిఎస్‌ఆర్ నిధుల ద్వారా పారిశుద్ధ్య వాహనాలను సైతం కేటాయించబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని.. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అమీన్పూర్ సర్కిల్ పరిధిలో మంచినీటి కొరత లేకుండా చూడాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు అజయ్ రెడ్డి, తిరుపతి, వెంకట కిషన్, వెంకటరామయ్య, దశరథ్, డిఈ వెంకటరమణ, జలమండలి డీజీఎం శివ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




