గోల్కొండలో ఘనంగా ప్రారంభమైన ఆషాఢమాస బోనాలు
హైదరాబాద్: గోల్కొండ కోటలో ఘనంగా ఆషాఢమాస బోనాలు గురువారం ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో జగదాంబికా మహంకాళి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సమర్పించే 11 బోనాలతో తొలి బోనం కుమ్మర్లు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున లంగర్ హౌస్ నుంచి బయలుదేరిన బంగారు బోనం, అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమర్పించనున్నారు. అంతేకాకుండా గోల్కొండ పరిసర ప్రాంతాలు బోనాలతో భక్తజన సందోహంగా మారడంతో భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది.
ప్రారంభమయ్యే నెల రోజుల పాటు సాగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం తెలిపారు. హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో చివరి బోనం సమర్పణ, ఘటాల నిమజ్జనంతో ఈ ఉత్సవాలు ఆగస్టు 13న ముగుస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 3,000కు పైగా ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నందున, వేడుకలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా చూసేందుకు అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది ఉత్సవాల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేసినందుకు ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, అలాగే తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బోనాలు సమర్పించుకుని, సురక్షితంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా విస్తృత ఏర్పాట్లు చేశామని సురేఖ పేర్కొన్నారు.






