ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మార్చి 18( విజయ క్రాంతి) :ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం లో రాజకీయ పార్టీల నాయకులు , అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని అన్నారు. సూపర్వైజర్లు, ఏఈఆర్‌ఓలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఓటు నమోదు కాకుండా జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. రాజకీయ పార్టీల ద్వారా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించడంతో పాటు బీఎల్‌ఓలకు ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. మరణించిన ఓటర్ల వివరాలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. సవరణ ప్రక్రియలో మంచి పురోగతి సాధించాలని డీఎస్‌ఈ పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, రాజకీయ పార్టీల నాయకులు గడ్డం శ్రీనివాస్, సయ్యద్ ఇస్రాత్, సలీం, దేవి సింగ్, గౌస్ కురేషి, నర్సమ్మ, స్వామి దాస్ లు, ఆర్డీఓలు, జయ చంద్ర రెడ్డి, రమాదేవి, తహసిల్దార్ లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.




