శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
- సీపీ అంబర్ కిషోర్ ఝా
- తాళ్ళగురజాల పీఎస్ తనిఖీ
బెల్లంపల్లి, మే 26: ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడంతో పాటు, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్ రిసెప్షన్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమాని తుల వివరాలు, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది సమస్యలను కూడా సీపీ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై అధికారులతో మాట్లాడారు. పాత కేసులన్నింటినీ పరిశీలించి, ముఖ్యంగా హత్య కేసుల దర్యాప్తును పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడంతో పాటు, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. పోలీస్ అధికారులు విధి సమయంలో తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని సూచించారు. జీరో ఎఫ్‌ఐఆర్తో పాటు ఆన్ ది స్పాట్ ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
కొన్ని రకాల నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా సంఘటన స్థలానికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 80 నుంచి 90 శాతం కేసుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని, వెంటనే స్పందించి బాధితులకు సేవలు అందిస్తామని సీపీ తెలిపారు. హైవే ప్రాంతాలు,అభివృద్ధి చెందుతున్న బస్తీల పరిధిలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారుల కు సూచించారు.
భూవివాదాల్లో పోలీసుల జోక్యం లేకుండా చట్టపరమైన విధానంలో వ్యవహరించాలని అధికారులకు అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, క్రమశిక్షణ,పరిశుభ్రత, నేర కేసుల దర్యాప్తులో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని సీపీ అభినందించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






