31 July, 2026 | 5:53 PM

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి

31-07-2026 05:16 PM

ఉద్యోగ విరమణ అధికారులను సన్మానించిన ఎస్పీ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తూ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు కర్తవ్యనిబద్ధతతో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు జిల్లా షీ టీం ఎస్ఐ ఎండి ఫజల్ ఖాన్, గణపురం ఏఎస్ఐ జె సమ్మిరెడ్డి, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏఆర్ ఎస్ఐ ఎస్ ఉపేందర్ లను పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించగా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైనదని, కుటుంబానికి దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం అంకితభావంతో సేవలందించడం పోలీస్ సిబ్బంది గొప్పతనమని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిడులు, సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా అధిగమించి సేవలందించిన రిటైర్డ్ అధికారుల సేవలు పోలీస్ శాఖకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతూ ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ రత్నం, ఉద్యోగ విరమణ అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.