వారం ముందే రుతురాగం!
జూన్ మొదటి వారంలో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు
ఈ నెల 26న కేరళంకు రాక
నేడు అండమాన్‌కు ఆగమనం
వెల్లడించిన వాతావరణశాఖ
హైదరాబాద్, మే 15: రైతులకు తీపికబురు. ఈ సారి వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు తెలంగాణకు రాకనున్నాయి. ఈనెల 26వ తేదీన కేరళంకు నైరుతి రుతుపవనాలు తాకుతాయని, నేడు అండమాన్ నికోబర్ దీవులకు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
ఈ ప్రభావంతో శనివారం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 26న కేరళంను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం వెల్లడించింది. రుతుపవనాలు ఉత్తరం వైపుగా విస్తరిస్తున్న కొద్దీ, ఆయా ప్రాంతాల్లో వేసవిలో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. సాధారణంగా జూన్ 1నాటికి రుతుపవనాలు పలుకరిస్తుంటాయి. కానీ ఈ సారి ఐదు రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
అంటే తెంలంగాణలో జూన్ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా ఈసారి ఎల్‌నినో భయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రారంభమైందని ఇప్పటికే ఇన్‌కాయిస్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులుండగా తాజాగా ఎల్‌నినోగా మారిందని వెల్లడించింది. ప్రస్తుత మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది.
రుతుపవనాలు మొదటిదశలో అంటే జూన్ నుంచి జూలై ప్రారంభంలో స్థిరమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎల్‌నినో బలపడి, దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నాయి. రుతుపవనాల రాకపై ప్రకటన వెలువడంతో దేశంలోని రైతులు ఖరీఫ్ సాగుపనులకు సిద్ధమవుతున్నారు. భారత ఆహారభద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలకపాత్ర పోషిస్తాయి.






