20 June, 2026 | 10:47 PM

బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి

20-06-2026 09:40 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారం, బి ఎల్ ఓ యాప్ లపై బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివారం జిల్లాలోని కెనమెరి మండలం కేస్లాగూడ రైతు వేదికలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 లో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్వైజర్లు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎన్యుమరేషన్ ఫారం, బి ఎల్ ఓ యాప్ లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బి ఎల్ ఓ లు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేసే క్రమంలో వాలంటీర్ల సహకారం తీసుకోవాలని, మ్యాపింగ్ అయిన వారి వివరాలు, మ్యాపింగ్ కానీ వారి వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయాలని తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఫారం 6 ద్వారా చేసుకున్న దరఖాస్తులను తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారం లో అవసరమైన పత్రాలతో తిరిగి తీసుకుని యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా చేపట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులకు కిట్లను అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు.