06-02-2026 09:55:41 PM
జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దాడిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య త్యాగం ప్రతి ఎక్సైజ్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ అన్నారు. ఆసిఫాబాద్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సంతాప సభలో ఆమె సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జ్యోతి కిరణ్ మాట్లాడుతూ... గంజాయి వంటి అక్రమ కార్యకలాపాల నిర్మూలన కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం సంపూర్ణ అండగా నిలవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్సైజ్ శాఖ మరింత అప్రమత్తతతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని సౌమ్యకు ఘనంగా నివాళులర్పించారు.