ఘనంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి – శ్రీ పోచమ్మ ఆలయ బోనాల ఉత్సవాలు
ఉప్పల్ ఆగష్టు 16 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ శక్తి సాయి నగర్ డివిజన్‌లోని చాణిక్యపురి కాలనీలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి – శ్రీ పోచమ్మ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల జైజైధ్వానాలతో ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గంధ మల్ల రాములు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు కృష్ణ నర్సింగరావు, విజయ కాలనీ అధ్యక్షుడు దశరథ్, కార్యదర్శి కిషోర్ గౌడ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాల విజయవంత నిర్వహణకు సహకరించిన భక్తులు, దాతలు, కాలనీవాసులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






