16 August, 2026 | 8:33 PM

కార్పొరేషన్ కార్మికుడు జైత్రామ్ మృతి బాధాకరం

16-08-2026 06:46 PM

కుటుంబానికి వారసత్వ ఉద్యోగం, పరిహారం, త్వరగా అందేలా చూడాలి.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

​కొత్తగూడెం ఆగస్టు 16 (విజయక్రాంతి): విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతూ మున్సిపల్ కార్మికుడు భూక్యా జైత్రామ్ మృతి చెందడం బాధాకరమని, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం మంగపేట 23వ డివిజన్‌కు చెందిన మల్టీ పర్పస్ కార్మికుడు జైత్రామ్ విద్యుత్ దీపాలు అమర్చుతూ స్తంభంపై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని మమత జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని తెలియడంతో ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సుజాత, మేయర్ మూడ్ గణేష్‌లతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మరణించిన కార్మికుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని, ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ద్వారా తక్షణ ఆర్థిక పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం కల్పించేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్మికుడికి రావాల్సిన అన్ని రకాల టెర్మినల్ బెనిఫిట్స్ ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన కుటుంబ సభ్యులకు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సాంబశివరావు ,జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కె షాబిర్ పాషా, మేయర్ మూడు గణేష్ భరోసా ఇచ్చారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి గెద్దాడు నగేష్, కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, బండి నరసింహ, ధనరాజ్, దినేష్ తదితరులు నివాళులు అర్పించారు.