అనారోగ్యంతో తల్లి.. వేదనతో కుమారుడి మృతి
ఐనవోలులో విషాదాన్ని నింపిన మరణాలు
ప్రతీ ఒక్కరినీ కలచివేసిన విషాద ఘటన
ఐనవోలు (మహబూబాబాద్), ఆగస్టు 29 (విజయక్రాంతి): అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే తల్లి మరణాన్ని తట్టుకోలేని ఆ కుమారుడు కూడా గుండెపోటుతో కన్నుమూసిన ఘటన వరంగల్ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే.. ఐనవోలు గ్రామానికి చెందిన కొండేటి మల్లికాంబ (65) అనారోగ్యానికి గురై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందు తూ గురువారం రాత్రి మృతి చెందింది. మ ల్లికాంబ పార్థివ దేహానికి శుక్రవారం రాత్రి అంతిమయాత్ర నిర్వహిస్తుండగా ఆమె కు మారుడు రవి (35) మనోవేదనతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు.
వెంటనే బంధువులు స్థానికంగా ప్రథమ చికిత్స అందజేసి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి రవిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొద్ది గంట ల వ్యవధిలోనే తల్లి తనయుల మృతితో వారి కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం నానమ్మ చితికి.. సాయంత్రం తండ్రి రవి చితికి రవి కుమారుడు దీక్షిత్ తలకొరివి పెట్టడం గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది.






