ఖానాపూర్ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి కి పరిష్కారం
పలు సమస్యలపై తీర్మానం
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం మున్సిపాలిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానాలు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ తెలిపారు. ప్రధానంగా రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని మసీదులకు వెళ్ళేటటువంటి రోడ్లు గుంతలు పూడ్చి పండుగ రోజు అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు.
పట్టణంలోని అన్ని వార్డులలో బోరు మోటార్ల రిపేరింగ్, శానిటేషన్ పనుల నిర్వహణ ,నూతన కరెంటు స్తంభాల ఏర్పాటు, వంటి పలు సమస్యలపై చర్చించామని ఆమె అన్నారు. ప్రత్యేకంగా పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా సమస్యను పరిష్కరించేందుకు రెండు అదనపు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయించామని, మంగళవారం నుంచి అవి అందుబాటులో ఉంటాయని అన్నారు .ఏ కాలనీ లో నీటి సమస్య ఉన్న కౌన్సిలర్ కు గాని కార్యాలయంలో గాని తెలియజేయాలని ఆమె అన్నారు.






