గంగా-జమునా తెహజీబ్‌ను కాపాడుకుందాం
త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ ప్రశాంతంగా ప్రజలు జరుపుకోవాలి
రామగుండంలో మత పెద్దలతో పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి
పెద్దపల్లి,(విజయక్రాంతి): గంగా-జమునా తెహజీబ్‌ను కాపాడుకుందామని, త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసు యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. రామగుండం పోలీస్ స్టేషన్‌లో రామగుండం సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ సంధ్యారాణి సమన్వయంతో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జిల్లాలో గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం) ఎప్పటి నుంచో కొనసాగుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని తెలిపారు. సెల్‌ఫోన్ వినియోగం పెరగడంతో కుటుంబ బంధాలు దూరమవుతున్నాయని, యువత సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బక్రీద్ పండుగ శాంతి, సహనం,పరస్పర గౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ, జిల్లాలో అన్ని పండుగలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు.
రోజుకు కనీసం పది నిమిషాలైనా కుటుంబ సభ్యులతో గడపాలని, సెల్‌ఫోన్ల కారణంగా ఒకరికొకరు దూరం కాకూడదని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని కొనసాగించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వాహనాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, పండుగ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని తెలిపారు.
ప్రభుత్వం అనుమతించిన నిర్ణీత ప్రదేశాల్లోనే జంతువధ (ఖుర్బానీ) నిర్వహించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో జంతు అవశేషాలను పారవేయకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు.






