27 March, 2026 | 2:02 AM

బ్యాండ్ మేళం సౌండ్ ఎలా ఉందంటే..?

27-03-2026 12:19 AM

సినిమా రివ్యూ :

కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ సినిమాకు కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఇందులో ‘కోర్ట్’ సినిమాతో అందరినీ ఆకర్షించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించిన ఈ చిత్రంపై మొదట్నుంచీ మంచి అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా మార్చి 26న (గురువారం) విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాకు సపోర్ట్ చేశారు. ‘బ్యాండ్ మేళం’ సౌండ్ చేయాలని ఆకాంక్షించారు. మరి అందరూ కోరుకున్నట్లు ఈ సినిమా సౌండ్ చేస్తోందా? 

కథ ఏంటేంటే.. 

యాదగిరి ఉరఫ్ గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) బావామరదళ్లు. ఒకేరోజు పుట్టి, చిన్నప్పుట్నుంచి కలిసే పెరుగుతారు. పెద్దయ్యాక ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు ముందే అనుకుంటారు. కానీ, ఈ మేన బావ, మేన మరదలు పెరిగి పెద్దవుతున్నకొద్దీ బావామరదళ్ల మధ్య కూడా దూరం పెరుగుతుంది. కారణం ఇరు కుటుంబాల ఆర్థిక పరిస్థితి తారుమారైపోవడం. మరోవైపు రాజి చదువుల్లో టాపర్‌గా నిలుస్తూ, ఉన్నత చదువుల కోసం సిటీకి వెళ్తుంది.

చిన్నప్పుట్నుంచీ సంగీతంపై ఆసక్తి కలిగి ఉండే గిరి ఊళ్లో స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ నిర్వహిస్తాడు. కానీ, అది కూడా కలిసి రా దు. తనకు కాబోయే భార్య తన మరదలేనని అందరికీ చెప్పుకు తిరిగే క్రమంలో అతని మామ సాయన్న (సాయికుమార్) తన కూతురు రాజికి మరో అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి పీటల దాకా వెళ్లిన తర్వాత ఏం జరిగింది? తను ఇష్టపడ్డ సంగీత రంగంలో గిరి విజయం సాధించాడా? తన మరదలి ప్రేమను గెలుచుకున్నాడా? అనే దే మిగతా కథ.  

సినిమా ఎలా ఉందంటే..? 

ఇది బావామరదళ్ల ప్రేమకథతో తెరకెక్కించిన ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశపర్చదు. తెలంగాణ నేపథ్యపు కథ ఆకట్టుకుంటుంది. పైసల వెంట పరుగెత్తే సాయన్న క్యారెక్టర్ రియలైజ్ కావడం, బంధాలు బంధుత్వాల విలువు గుర్తించడం.. నిజ జీవితంలో చేసిన సాయం ఏనాటికైనా ఊరకే పోదని మ్యాంగో మ్యూజిక్ ఎంప్లాయ్ క్యారెక్టర్ ద్వారా తెలియజేయడం మెప్పిస్తాయి. ఫస్టాఫ్‌లో కామెడీ నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్ మొదలవగానే కథ ఎంతకూ ముందుకు సాగనట్లు అనిపిస్తుంది. సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. రొటీన్ స్టోరీ, యాసను పలికించడంలో లోపం వంటి చిన్న చిన్న లోపాలను పక్కనపెడితే చూడదగ్గ సినిమానే అని చెప్పవచ్చు.  

యాస పలకడంలో తడబడ్డ నటులు.. 

తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణపల్లి అనే ఊళ్లో ప్రారంభయ్యే ఈ కథలో అతిపెద్ద లోపం డైలాగులే. ఇక్కడి యాస పలకడంలో నూరు శాతం న్యాయం చేయకపోయినప్పటికీ నాయకానాయికలు హర్ష్ రోషన్, శ్రీదేవి పర్వాలేదనిపించారు. హర్ష్ రోషన్ తండ్రి పాత్ర లో కనిపించిన గోపరాజు విజయ్ తెలంగాణ మాండలికం పలకడంలో తడబడ్డారు. బేస్ వాయిస్‌తో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న సాయికుమార్ కూడా యాస పలకడంలో భేష్ అనిపించలేకపోయారు. సహాయ నటుల పాత్రల కోసం స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే తెలంగాణ నేపథ్యపు కథకు పూర్తి న్యాయం చేశారన్న భావన కలిగేది. 

పెద్దతెరపై తెలంగాణ జానపదాల సందడి 

అయితే, ఇక్కడ ప్రజాదరణ పొందిన జానపదాలకు ఈ సినిమాలో పెద్దపీట వేశారు. ‘బొంబాయి పోతనని దాని మనసు.. దాని బొట్లా చీర మీద నా మనసు..’, ‘బంతిపూల దండ అటేత్తున నేన్ ఇటేత్తున..’, ‘మేనమామా కూతురా.. మరదలు పిల్లా మాటలాడవమ్మో..’,  ‘మా గల్లీల ఒక్కకడు పోరడు..’, ‘దాని కుడి భుజం మీద కడవా..’ వంటి ఎన్నో జానపదాలు పెద్దతెరపై వినసొంపుగా అనిపిస్తాయి.