సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... సిద్ధాపూర్ రిజర్వాయర్ కు మరో రూ.200 కోట్లు మంజారు చేస్తామని, నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడుతామని పేర్కొన్నారు. రిజర్వాయర్ ద్వారా 7900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ముందుకెళ్తామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ హయంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థితి ఏమైందో అందురూ గమనించాలని, ఆ ప్రాజెక్టులు వాళ్ల పాలనలోనే కూలిందని ఎద్దేవా చేశారు. డిజైన్లు, నిర్మాణం లోపభూయిష్టమే కారణమని నిపుణులు చెప్పారు. రాష్ట్రంలో 1.05 కోట్ల మందికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని, వరి రైతులకు ప్రభుత్వం రూ.35 వేల కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు.






