ప్రేక్షకులెందుకు రావట్లేదనిన..!
* సినిమా అనేది కేవలం ఒక వినోద సాధనం కాదు. అది ఒక సంస్కృతి. ఒక భావోద్వేగం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో భాగమైన ఒక సామాజిక శక్తి. మూడు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే, ఏడిపించే, ఆలోచింపజేసే అద్భుత మాధ్యమం. ఒకప్పుడు కొత్త సినిమా విడుదల అంటే పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబాలు కలిసి థియేటర్లకు వెళ్లేవి.
స్నేహితులు గుంపులుగా సినిమాలు చూసేవారు. కొన్ని సినిమాలు 100 రోజులు, 175 రోజులు, కొన్ని సందర్భాల్లో సంవత్సరం వరకు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా, ప్రేక్షకులు థియేటర్లకు మొహం చాటేయడం వెనుకా కారణాలు బోలెడు!
సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు వస్తున్నాయి. వారం రోజులు గడవక ముందే సినిమా హిట్ లేదా ఫ్లాప్ అని తీర్పులు వచ్చేస్తున్నాయి. నెల రోజులు పూర్తికాక ముందే ఓటీటీలో విడుదల అవుతోంది. మరోవైపు పైరసీ మరింత విస్తరిస్తోంది. ఇది మార్పు కాదు. పరిశ్రమకు ఇది హెచ్చరిక. సినిమా ఖరీదైపో యిందా? లేక ప్రేక్షకుడి సామర్థ్యం తగ్గిందా? ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే ఎంత ఖర్చవుతుందో లెక్క వేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రయాణ ఖర్చులు, పార్కింగ్, టికెట్లు, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కలిపి తక్కువలో తక్కువ రూ.2 వేలు ఖర్చవుతోంది. అదే మొత్తంతో ఏడాది పాటు ఓటీటీలో ప్రపంచస్థాయి సినిమాలు, సిరీస్‌లు చూడగలిగే పరిస్థితి ఉంది. అందుకే నేటి ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలంటే పరిశ్రమ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవా ల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో సినిమా వ్యాపార విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా నెలల తరబడి ఆడాలని ఆశించే వారు.
ఇప్పుడు మొదటి వారంలోనే పెట్టుబడి తిరిగి రావాలని ఆశిస్తున్నారు. దీనివల్ల టికెట్ ధరలు పెరగడం, ప్రత్యేక షోలు, ప్రీమియం రేట్లు, అధిక ధరల వ్యూహాలు అమలవుతున్నాయి. ఇవి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. నటీనటుల పారితోషికాలు, సాంకేతిక ఖర్చులు, ప్రచార వ్యయం అన్నీ పెరిగాయి. కానీ, ప్రేక్షకుడి జేబు కూడా ఒక పరిమితి వరకు మాత్రమే భరిస్తుంది.
ఆ పరిమితిని దాటితే అతను ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతాడు. పైరసీని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం. ఒక సినిమా కోసం వందలాది మంది కష్టపడితే, దానిని అక్రమంగా చూడటం వారి శ్రమను దోచుకోవడమే. కానీ పైరసీ ఎందుకు పెరుగుతోందో కూడా పరిశ్రమ ఆలోచించాలి. అధిక టికెట్ ధరలు, సులభంగా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్, టెక్నాలజీ విస్తరణ, వేగంగా లీక్ అవుతున్న డిజిటల్ కంటెంట్, ఇవన్నీ కలిసి పైరసీకి అవకాశం కల్పిస్తున్నాయి.
రివ్యూలు, సోష ల్ మీడియా కూ డా ప్రభావితం చే స్తున్నాయి. నేడు సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో తీర్పులు వెలువడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సినిమా చూడకముందే ప్రేక్షకుడు ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాడు. ఇది కూడా థియేటర్ రన్‌ను ప్రభావితం చేస్తోంది. అభిప్రాయ స్వేచ్ఛ కూడా అవసరమే. కానీ ఒక సినిమా వెనుక వేలాది మంది జీవితాలు ఉన్నాయనే బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి.
సినిమా పరిశ్రమలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఓటీటీలు అందరూ ముఖ్యమే. కానీ వీరందరినీ నిలబెట్టేది ప్రేక్షకుడే. ప్రేక్షకుడు సంతోషంగా ఉంటేనే థియేటర్ బతుకుతుంది. థియేటర్ బతికితేనే నిర్మాత బతుకుతాడు. నిర్మాత బతికితేనే కొత్త కథలు వస్తాయి. కొత్త కథలు వస్తేనే సినిమా పరిశ్రమ ముందుకు సాగుతుంది. అందుకే ప్రతి నిర్ణయంలో కేంద్రబిందువుగా ప్రేక్షకుడు ఉండాలి.
సినిమా పరిశ్రమ నేడు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక్క పరిష్కారం లేదు. కానీ ఒక మార్గం మాత్రం ఉంది - సమతుల్యత. టికెట్ ధరల్లో సమతుల్యత అవసరం. వ్యాపార లాభాలు, ప్రేక్షకుడి సామర్థ్యాల మధ్య సమతుల్యత. ఆ సమతుల్యతను సాధించగలిగితే పైరసీ తగ్గుతుంది. థియేటర్లు బలపడతాయి.
నిర్మాతలు నిలబడతారు. ఓటీటీలు అభివృద్ధి చెందుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రేక్షకుడు మళ్లీ సినిమాను ఒక పండుగగా ఆస్వాదించే రోజులు తిరిగి వస్తాయి. ప్రేక్షకుడిని కోల్పోయిన పరిశ్రమ ఎంత పెద్దదైనా నిలవదు. ప్రేక్షకుడిని గెలుచుకున్న పరిశ్రమను మాత్రం ఎవరూ ఆపలేరు.
ఓటీటీ విధానం మారాలి..
కొంతమంది ఓటీటీలను సినిమా పరిశ్రమకు ప్రమాదంగా చూస్తారు. కానీ వాస్తవానికి ఓటీటీలు కొత్త అవకాశాలు తెచ్చాయి. చిన్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అందించాయి. కొత్త కథలకు వేదికగా నిలిచాయి. ప్రేక్షకుడికి సౌకర్యం కల్పించాయి. సమస్య ఓటీటీలో లేదు. థియేటర్, ఓటీటీ మధ్య సమతుల్యత లేకపోవడంలో ఉంది. ఒక సినిమా విడుదలైన కొద్ది వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందని తెలిసినప్పుడు, చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం మానేసు ్తన్నారు.
కొద్దిరోజులు ఆగితే ఇంట్లోనే చూస్తామనే భావన పెరుగుతోంది. ఇది థియేటర్లకు పెద్ద సవాలుగా మారుతోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం మూడు నెలల గ్యాప్ ఇచ్చి ఓటీటీలో విడుదల చేసే విధానం మళ్లీ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యవధిలో సినిమా థియేటర్లలో తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించగలదు. నిర్మాతకు అదనపు ఆదాయం వస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌కు న్యాయం జరుగుతుంది. థియేటర్లు బతుకుతాయి. టికెట్ ధరలపై కొత్త ఆలోచన అవసరం.
సినిమా విడుదలైన తొలి మూడు రోజులు కొంత ప్రీమియం ధరలు ఉండవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ప్రధానంగా అభిమానులు మరియు ఆసక్తిగల ప్రేక్షకులే వస్తారు. కానీ ఆ తర్వాత ధరలను తగ్గించాలి. విమాన టికెట్ల మాదిరిగా డిమాండ్ ఆధారిత విధానాలు, కుటుంబ ప్యాకేజీలు, వారాంతపు ఆఫర్లు, విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు వంటి కొత్త విధానాలను పరిశీలించాలి. థియేటర్లో ప్రతి సీటు నిండటం కూడా ఒక విజయమే. ఖాళీ సీట్లతో అధిక ధరలు వసూలు చేయడం కంటే, అందుబాటులో ఉన్న ధరలతో ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించడం మంచిది.
ఆ విజయభాస్కర్ కైలాసపు






