ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
హన్మకొండ,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్‌ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రానున్న 15 రోజుల్లో కనీసం 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్ ఘన్‌పూర్, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాలలో ఇప్పటికే 80 శాతానికి పైగా మ్యాపింగ్ పూర్తి చేశాయని తెలిపారు. ఒడిశా రాష్ట్రం 90 శాతం, కర్ణాటక 81 శాతం, మహారాష్ట్ర 68 శాతం మ్యాపింగ్ పూర్తి చేశాయని, తెలంగాణ ఇంకా పురోగతిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను ప్రోత్సహిస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మ్యాపింగ్ పురోగతిని పెంచేందుకు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బీఎల్‌ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి నియమిస్తున్నామని, రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అర్హ ఓటరు పేరు సక్రమంగా మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలో 56 శాతం, పరకాల నియోజకవర్గంలో 80 శాతానికి పైగా ఎలక్టోరల్ మ్యాపింగ్ పూర్తయ్యిందని తెలిపారు. తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, డబుల్ మరియు డెత్ షిఫ్ట్‌లను పరిశీలిస్తూ రానున్న పక్షం రోజుల్లో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.






