వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్‌నగర్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అదనపు ఐదు డయాలసిస్ బెడ్లను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వైద్య సౌకర్యాలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ అత్యవసర చికిత్స అని, ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో ఉన్న బెడ్ల కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు.తాజాగా మరో ఐదు డయాలసిస్ బెడ్లు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది రోగులకు సకాలంలో చికిత్స అందే అవకాశం ఏర్పడిందని, ముఖ్యంగా పేద ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.అనంతరం ఆసుపత్రిలోని వైద్య సేవలు, డయాలసిస్ విభాగాన్ని పరిశీలించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






