సెలవైనా కొనసాగిన ‘సర్’
మహబూబాబాద్, జూలై 12 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ఆదివారం సెలవైనప్పటికీ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డిజిటలైజేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో, పట్టణంలోని వార్డుల్లో ఓటర్ల నుండి ఎస్‌ఐఆర్ పారాలను స్వీకరించి వాటిని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
2002 సంవత్సరానికి ముందు ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లతో పాటు ఆ తర్వాత ఓటర్లుగా నమోదైన వారి వివరాలు మ్యాపింగ్ చేసే పని చేపట్టారు. దీనికి తోడు ఓటర్ల కు ఇంకా మిగిలిపోయిన పారాలను అందించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్కడికక్కడే బూత్ లెవెల్ ఆఫీసర్లు క్యాంపులు ఏర్పాటు చేసి, సవరణ ప్రక్రియకు అవసరమైన అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 25 లోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తిచేసి డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.
ఎస్‌ఐఆర్ ప్రకారం ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్ధారించుకోవడానికి అవసరమైన అవగాహన కల్పించడానికి గ్రామస్థాయిలో పల్లె ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రత్యేకంగా కళాజాత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ సీజన్ కావడంతో వ్యవసాయ పనులకు వెళ్లకు ముందే వ్యవసాయ కూలీలు, రైతులు తమకు ఇంతకుముందే ఇచ్చిన ఓటరు సవరణ పత్రాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, అంగన్వాడి అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కార్యక్రమంలో పనిచేసే విధంగా ముందుకు సాగుతున్నారు.
ప్రజావాణి కార్యక్రమం రద్దు
జిల్లావ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులంతా ఎస్‌ఐఆర్ ప్రక్రియ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున, ప్రజలు కూడా తమ ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి అనువుగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలంతా తమ ఓటు హక్కును ఎస్‌ఐఆర్ ద్వారా మ్యాపింగ్ చేయించుకోవాలని కలెక్టర్ కోరారు.






