సీత దాటింది ఫీజుల గీత!
అంజనీ సిమెంట్స్ ఆధ్వర్యంలో సీతా మెమోరియల్ పాఠశాల ఏర్పాటు
సేవపేరిట ప్రారంభం.. లాభాల బాటలో పయనం..?
గతంలో నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్యా సేవలు
ఈ విద్యా సంవత్సరంలో స్కూలు, వ్యాన్ ఫీజులలో గణనీయమైన పెరుగుదల
పెంచిన ఫీజులు తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికుల వేడుకోలు
చింతలపాలెం, ఆగస్టు 13: పరిశ్రమలు ఏర్పాటు అయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆర్థిక అభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడతాయన్న అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు వాటికి అనుమతులు ఇస్తుంటాయి.
ఇదే కోవలో ఏర్పాటై మండలంలో కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్న అంజనీ (చెట్టినాడ్) సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం.. స్థానిక ప్రజల, విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాలన్న సదుద్దేశ్యంతో శ్రీమతి సీత మెమోరియల్ స్కూల్ ను ప్రారంభించి దాని ద్వారా విద్యార్థులకు విద్యా సేవలను అందిస్తూ వస్తుంది. అందులో ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగుల, కార్మికుల పిల్లల నుండి నామమాత్రపు ఫీజులను వసూలు చేసి గుణాత్మకమైన విద్యను అందించేది.
ఇంతవరకు బాగానే నడిపించినప్పటికీ ఈ విద్యాసంవత్సరం ఉన్నట్టుండి ఒక్కసారిగా స్కూల్, బస్సు ఫీజులను భారీగా పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయ లేని భారం పడిందని వారే చెబుతున్నారు. మొత్తానికి సీత ఫీజుల గీత దాటింది అనే చర్చ స్థానికంగా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలా అడ్డు, అదుపు లేకుండా పెంచిన ఫీజుల భారంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కినా, యాజమాన్యం కనీసం స్పందించకపోవడం దారుణమని స్థానికులు వాపోతున్నారు.
లాభాలు సరే.. సేవల మాటేంటి?
ఫ్యాక్టరీ ఏర్పాటు నుండి ఇక్కడ ఉన్న వనరులను యాజమాన్యం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ కోట్ల రూపాయల ఆదాయంలో పోగేసుకుంటుందనీ స్థానికులే చెబుతున్నారు. అయితే ఫ్యాక్టరీ నుండి వస్తున్న విపరీతమైన కాలుష్యం, సిమెంట్ దుమ్ము వల్ల ఈ ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారని పలువురు స్థానికులు అంటున్నారు.
ఇక్కడి భూములు, గాలి, నీరు అన్నీ కలుషితమైపోయాయనీ, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) కింద స్థానిక ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి, లాభాలే పరమావధిగా యాజమాన్యం వ్యవహరిస్తోందనే విమర్శలు స్థానికంగా వినిపి స్తున్నాయి. ఫ్యాక్టరీ కాలుష్యాన్ని భరిస్తూ, ఇక్కడే బతుకుతున్న స్థానిక కార్మికులు, రైతుల పిల్లల చదువులపై కోత విధిస్తూ భారీగా ఫీజులు పెంచడం ఎంతవరకు న్యాయం అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన.. యాజమాన్యం మొండివైఖరి
శ్రీమతి సీత మెమోరియల్ స్కూల్ యాజమాన్యం పెంచిన స్కూల్ ఫీజులు, బస్సు ఛార్జీలు సామాన్యుడికి భారంగా మారాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ‘ఫీజులు తగ్గించండి మహాప్రభో‘ అని విన్నవిస్తున్నా, కనీసం మాట్లాడేందుకు కూడా స్కూల్ యాజమాన్యం, ఫ్యాక్టరీ ప్రతినిధులు ముందుకు రాకపోవడం దారుణమనీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్ధుల తల్లిదండ్రులు అంటున్నారు.. స్థానిక పిల్లల భవిష్య త్తును అంధకారంలోకి నెట్టేస్తూ, వారి చదువును వ్యాపారంగా మార్చేసిందని స్థానికు లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం మాత్రం తన మొండి వైఖరిని వేయడం లేదని స్థానికులు చెబుతుండడం గమనించదగ్గ విషయం.
బాధ్యత మరచి.. వ్యాపార దృక్పథం వలచి
ఫ్యాక్టరీ వల్ల వచ్చే కాలుష్యాన్ని భరిస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా, అత్యంత తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత సిమెంట్ పరిశ్రమ యాజమాన్యంపై ఉంది. కానీ, బాధ్యతను మరిచి వ్యాపార దృక్పథమును వ్యవహరిస్తున్న యాజమాన్యాన్ని స్థానిక నాయకులు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించకపోతే ఫ్యాక్టరీ గేటు ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు అంటుండడం గమనా ర్హం . యాజమాన్యం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఆపి పెంచిన ఫీజులను తగ్గించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని వారి తల్లిదండ్రులు, పలువురు మేధావులు, విద్యావం తులు, స్థానికులు కోరుతున్నారు.
సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం లేదు..
యాజమాన్యం పాఠశాల ఫీజులను బాగా పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ స్కూలు వల్ల స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఆంధ్ర కార్మికుల పిల్లలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. కానీ మాలాంటి సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇక పెంచిన ఫీజులను తగ్గించమని నెల రోజులుగా యాజమాన్యాన్ని తల్లిదండ్రులు వేడుకుంటున్నా కనీస స్పందన కరవడం దారుణం.
దారావత్ నరసింహ, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్
యాజమాన్యానికి లాభాలే ముఖ్యం
వాస్తవికంగా యాజమాన్యం పిల్లల భవిష్యత్తు గురించి కాకుండా వారికి వచ్చే లాభాలకే ప్రాధాన్యతనిస్తుంది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హత మీద కూడా చాలామంది తల్లిదండ్రులకు అనుమానాలు ఉన్నాయి. అర్హత లేని వారు విద్యాబోధన చేయడం వల్ల మా పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ఇది ఒకరిద్దరి తల్లిదండ్రుల అభిప్రాయం కాదు అనేకమంది మనసులో ఉన్న మాట.
యరబోలు రాంరెడ్డి, స్థానికుడు






